(ఈ నెల ప్రారంభంలో శుక్రుడు మేషరాశిలోనూ, 15వ తేదీ దాకా రవి వృషభ రాశి లోనూ, అటు పిమ్మట మాసంతం వరకు మిధున రాశి లోనూ కుజుడు ఏడవ తేదీ నుంచి సింహరాశిలో, కేతువుతో కలిపి సంచారం, రాహు కుంభ రాశిలోనూ, శనీశ్వరుడు మీనరాశిలోనూ, దేవ గురువు మిధున రాశిలోనూ, ఇక బుధుడు 22వ తేదీ వరకు మిధున రాశి లోనూ, మాసము చివరి వరకు కర్కాటక రాశిలోనూ సంచరించును.)
Discover the monthly horoscope for June 2025 for all 12 zodiac signs. Know how planetary movements will influence your career, health, finances, and relationships this month. Read your Rasi Phalalu in Telugu.
2025 జూన్ నెలకు సంబంధించిన మాసిక రాశి ఫలాలు – 12 రాశులపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థికం, సంబంధాలపై పూర్తి విశ్లేషణ.
మేషరాశి…. (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)
ఈ రాశి వారికి గ్రహముల మార్పు వల్ల ముఖ్యముగా కుజ గ్రహము నీచరాశిని వదిలి సింహరాశిలో ప్రవేశించటం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యము. ఆత్మీయులైన ఇతరులకు సహకరిస్తారు. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆలోచనలు ముందుకు వెళతాయి. సంతానము డైనమిక్ గా ఉంటారు. కుటుంబంలో వ్యక్తులతో విభేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాలు ఖర్చులు అధికము. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, మాసం మధ్యలో ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది, విద్యార్థులు విద్య మీద నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఆశించిన పనులలో విజయాన్ని సాధిస్తారు. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఉన్నత ఆలోచనలతో అనుకునే లక్ష్యాలు సాధించడానికి ధైర్యంగా ముందడుగు వేస్తారు. సృజనాత్మకత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలలో, పెట్టుబడుల విషయంలో అధిక జాగ్రత్తలతో, సంతానం వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదిత్య హృదయం, నవగ్రహ స్తోత్రాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన మేలు
వృషభరాశి…(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
మాసం మధ్య వరకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. వ్యక్తిగత శ్రద్ధ, హాబీల మీద ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహ వాతావరణం, కుటుంబంలోని సౌకర్యాలు, తల్లి, వాహన, విద్యా విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాలలో శ్రద్ధ లోపిస్తుంది కొంత అలజడి. విద్యార్థులు విద్య మీద, వ్రాత నైపుణ్యాల మీద ఆసక్తి పెంచుకోవాలి. వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వల్ల కొంత అ శాంతి. ఆర్థిక విషయాలు, కుటుంబము, అనుకూలంగా ఉంటాయి, వృత్తి విషయంలో శ్రమతో కూడిన అనుకూలతలు. మాసం మధ్య నుంచి తండ్రి పెద్దలతో విభేదాలు రాకుండా ఆర్థిక విషయాల్లో అనుకూలతల కొరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. సూర్యనారాయణ స్వామి స్తోత్రాలు, లక్ష్మీనారాయణ స్తోత్రాలు, కుజ అష్టోత్తరం మేలు
మిధున రాశి…(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
గ్రహ సంచారము ను అనుసరించి మాస ప్రారంభం ఆర్థిక , జీవిత భాగస్వామి అనుబంధం, వాహన విషయాలు, సంతాన సంబంధ అంశాలు, సృజనాత్మకత అనుకూలంగా ఉంటాయి. ధైర్య సాహసాలు పెరుగుతాయి. శక్తి సామర్ధ్యాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టులతో కలిసి చర్చలు. దూర ప్రయాణాలు. రవి బుధ ప్రభావాల వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్య . మాసము మధ్య నుంచి ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, పెద్దలు మొదలైన వారితో చర్చించి అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార వ్యవహారాలు కొంతవరకు ముందుకు సాగుతాయి. ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం, దేవాలయ సందర్శన మేలు.
కర్కాటక రాశి…(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
గ్రహముల సంచారం వలన మాసము మధ్య వరకు ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో గవర్నమెంట్ పనులు కొంతమేర ముందు కదులుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. గత కాలంగా ఉంటున్న తీవ్ర మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు. మాట్లాడేటప్పుడు అధిక ఉద్వేగాలని కోపాన్ని అధిగమించాలి. కుటుంబ విషయాలు మీద శ్రద్ధ. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు. మాసము మధ్య నుంచి చివరి వరకు ఆరోగ్యం విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటూ, నిద్ర లేమి, ఒత్తిడి, అధిక ఖర్చులు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్లాలి. శత్రు రోగు రుణముల కొరకు ఖర్చులు చేస్తారు. దైనందిన జీవితంలో మార్పులు. నవగ్రహ ఆరాధన, హనుమాన్ చాలీసా మేలు.
సింహరాశి…(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
గ్రహ సంచారము అనుసరించి శుక్రుడు ప్రభావం వల్ల ఆర్థిక, వృత్తి, వాహన, గృహ, విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కుజుడి రాసి మార్పు వల్ల నిద్రలేమి తీవ్ర ఒత్తిడి అనారోగ్య చికాకులను అధిగమిస్తారు. పౌరుషం పెరుగుతుంది నాయకత్వ లక్షణాలు, కొత్త నిర్ణయాలు వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు, ఈ అంశంలో అష్టమ శని ప్రభావం ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాల్లోనూ, నూతన పరిచయాలలోనూ, జీవిత భాగస్వామితో అబద్ధాలు రాకుండా జాగ్రత్త పడాలి. వైరాగ్య ఆలోచనలను అధిగమించాలి. మాసం మధ్య నుంచి వృత్తిపరంగా అభివృద్ధి, నూతన అవకాశాలు, వ్యక్తుల ప్రశంసలు. ఇంక్రిమెంట్స్, పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కొత్త ప్రయాణాలు, పరిచయాలు. రాహు కేతువుల శ్లోకాలు వినడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన.
కన్యా రాశి…(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
మాసం ప్రారంభంలో శుక్ర ప్రభావం వల్ల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి, ఆర్థిక, కుటుంబ, వాహన అంశాలు. చక్కని మాటలతో అనుకున్న కార్యక్రమాలు సాధించగలుగుతారు. తండ్రి ఆరోగ్యమే శ్రద్ధ తీసుకుంటారు. తండ్రి తరపు బంధువులతో వివాదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. నూతన వృత్తి కొరకు ప్రయత్నం చేస్తే వారికి మాసం మధ్య నుంచి అనుకూలత. స్థిరాస్తులు కొరకు పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. పాత రుణములను తీరుస్తారు. తోబుట్టువులతో ఆర్థిక విషయాలలో అనవసర విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. శక్తికి మించిన ఖర్చులు ఘర్షణం పెంచుతాయి. ఆ విషయంలో జాగ్రత్త అవసరం. శ్రీ దత్త శరణం మమ, సూర్యనారాయణ స్వామి ఆరాధన, కుజ గ్రహ శ్లోకాలు మేలు.
తులా రాశి…(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
జీవిత భాగస్వామితో గతం కన్నా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది, కుజుని రాసి మార్పు వల్ల వృత్తిపరంగా, కుటుంబ, ఆర్థిక అంశాలలో గత చాలా నెలలుగా ఎదుర్కొంటున్న చికాకులని ఒత్తిళ్ళని అధిగమిస్తారు. మాట విలువ పెరుగుతుంది, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, నూతన శక్తి ఉత్సాహంతో ముందుకు వెళతారు. లాభాల విషయంలో వైరాగ్యాన్ని అధిగమించి ముందుకు వెళ్లాలి. మాసము మధ్యలో ఆకస్మిక ధన లాభం, ఆధ్యాత్మిక ప్రయాణాలు. అయినప్పటికీ ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులతో మాట్లాడేటప్పుడు విభేదాలు రాకుండా సమన్వయంగా ప్రవర్తించి పనిని సాధించుకోవాలి. విమర్శలను అధిగమించాలి. మాసం మధ్య నుంచి పెద్దల ఆరోగ్య విషయంలో, సంతానము దూర ప్రదేశాలలో విద్య కొరకు చేసే ప్రయత్నాలలో అధిక శ్రద్ధతో ముందుకు పెడతారు. ప్రేమ వ్యవహారాల విషయంలో, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్య హృదయ పారాయణ, సూర్యనారాయణ స్వామి ఆరాధన మేలు.
వృశ్చిక రాశి…(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
గ్రహ గమనాలను పరిశీలిస్తే కుజుని దశమ స్థాన శుక్రుని షష్ఠ స్థాన, రవి సప్తమాష్టమ స్థాన, గురు గ్రహ నవమ స్థాన, బుధ సప్తమ అష్టమ నవమ స్థాన సంచార, మార్పులని చూస్తే , ధైర్య సాహసాలు పెరుగుతాయి, ఇప్పటిదాకా అనవసరంగా అవుతున్న వ్యయములను అధిగమించే విధంగా ప్రణాళికలు వేసుకుంటారు. వృత్తిలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా ముందు కేడ తారు. అయినప్పటికీ భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, మీపై అధికారులతోనూ, ఉన్నతస్థాయి వ్యక్తులతోనూ, వ్యాపార వ్యవహారాల్లోనూ అత్యంత శ్రద్ధ అవసరం. మాసం మధ్య నుంచి చివరి వరకు వ్యక్తిగత ఆరోగ్య ప్రయాణ వ్యాపార వ్యవహారాలు కుటుంబ అంశాలు, అనవసర ఖర్చులను జాగ్రత్తగా చూసుకుంటూ అధిగమించాలి. కంటి ఆరోగ్య విషయంలో, డ్రైవింగ్ మొదలైన వాటి విషయంలో, వృత్తిపరమైన విషయాల్లో వైరాగ్యాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్లాలి. శ్రీ రాజమాతన్గయే నమః జపించాలి. నవగ్రహ ఆరాధన, దేవాలయ సందర్శన మేలు.
ధను రాశి…(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
మాస ప్రారంభంలో శుక్రుడు పంచమ స్థాన, గురుడు సప్తమ స్థాన, రాహు తృతీయ, కుజకేతువులు నవమ, రవి షష్ట సప్తమ, బుధుడు షష్ఠ, సప్తమష్టమ స్థాన , శని భగవానుడు చతుర్ధ స్థాన సంచారము అనుసరించి మాసం మధ్య వరకు ఆశించిన విషయాలలో అనుకూలత, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, శత్రువుల మీద విజయం సాధిస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగం కోసం, జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక విషయాలు, కుటుంబము, వ్యాపార వ్యవహారాలు ఆశించిన విధముగా ఉంటాయి. ఒత్తిడి లను అధిగమిస్తారు. ధైర్యం పెరుగుతుంది. నిర్ణయి సామర్థ్యం బావుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు సహకారం బాగుంటుంది. ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ బేధాలు సమసిపోతాయి. మాసం మధ్య నుంచి చివరి వరకు కొత్త విషయాలలో, వ్యాపార వ్యవహారాలలో, భాగస్వామితో, పెద్దలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తులు సహకారంతో పనులు నెరవేర్చుకోవడానికి శ్రమ అధికంగా ఉంటుంది. గణేశ శ్లోకాలు, గణపతి దేవాలయం సందర్శన మంచిది.
మకర రాశి…(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)
మాసములో మధ్య వరకు శుక్రుడు చతుర్ధం, రవి బుధులు పంచమం, గురుడు షష్ఠం, రాహువు ద్వితీయ, కేతువు అష్టము, శనీశ్వరుడు తృతీయం, కుజుడు అష్టమ స్థాన సంచారము అనుసరించి గృహ వాహనాలు, కుటుంబ సౌఖ్యం, వృత్తి అనుకూలంగా ఉంటుంది. సంతాన విషయాలు, పెట్టుబడులు, వ్యాపార వ్యవహారాలు, ఆత్మీయులైన వ్యక్తులతో అనుబంధాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు విద్యాసంబంధమైన విషయాల మీద శ్రద్ధ వహించాలి. జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా దస్తూరిని సరి చేసుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. గత కొన్ని నెలలుగా గృహ వాహన స్థిరాస్తి వృత్తిపరమైన విషయాలలో ఎదురవుతున్న ఒత్తిడిని ఈ నెలలో అధిగమించడానికి కొంతవరకు స్వల్పమైన అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ అష్టమ కుజ దోష నివారణ కొరకై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన అవసరము. మాసం మధ్య నుంచి షష్ఠ స్థానంలో బుధ, రవి మార్పు వల్ల వృత్తిపరంగా కొంత మార్పులు, కుటుంబ పరంగా, ప్రయాణాల ఖర్చులు, మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అపార్థాలకు లోను కాకుండా కుటుంబ సభ్యులతో ముందుకు వెళ్లాలి. దుర్గా శ్లోకములు, శ్రీ గణేశాయ నమః మంచిది.
కుంభ రాశి…(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
ఈ మాసములో కుజకేతువులు సప్తమ, జన్మ రాహువు, ద్వితీయ శని, తృతీయ శుక్రుడు, మాసము మధ్య వరకు బుధ రవి చతుర్ధం, పంచమ గురుడు గ్రహగతులను పరిశీలించగా జీవిత భాగస్వామితో, వ్యాపార వ్యవహార సంబంధించిన విషయాలలో అభిప్రాయ బేధములు రాకుండా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కోపము ఆవేశము నియంత్రించుకోవాలి. తల్లితండ్రుల ఆరోగ్య విషయంలోనూ, వారితో మీ కమ్యూనికేషన్ లోను, శ్రద్ధ తీసుకోవాలి. దగ్గర ప్రయాణాలు అధికం. ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, మైత్రి బంధాలు జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్లాలి. నూతన వాహన, స్థిరాస్తుల నిమిత్తం చర్చలు చేస్తారు. మాసం మధ్య నుంచి ప్రేమ వ్యవహారాలలో, పెట్టుబడులలో, సంతాన సంబంధ విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం సామాన్యం. దుర్గాదేవి, గణపతి ఆరాధన మంచి ఫలితములను ఇస్తుంది.
మీన రాశి…(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
ఈ మాసము శుక్రుడు ద్వితీయ స్థాన, రవి బుధుడు మాసం మధ్య వరకు తృతీయ, అటు పిమ్మట గురునితో కలిసి చతుర్ధస్థాన, కుజ కేతువులు షష్ఠస్థాన, రాహువు వ్యయ, శనీశ్వరుడు జన్మస్థాన సంచారం వలన గ్రహగతులను పరిశీలిస్తే, కుజుని రాసి మార్పు వల్ల శక్తి సామర్థ్యాలు నిర్ణయ సామర్థ్యం పరాక్రమంగా నిర్ణయాలు తీసుకుంటారు. గత కొన్ని నెలలుగా మానసిక అశాంతి, ఆర్థిక విద్యాసంబంధ విషయాలలో చికాకులు, ఆత్మీయులకు విభేదాలు, అధిక ఉద్వేగాలు ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని అధిగమించ గలుగుతారు ఇప్పుడు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, విదేశీ ప్రయాణాలకి అవకాశం. విద్యార్థులకు అనుకూల సమయం. ఆర్థిక, ఉన్నత విద్య, కుటుంబ విషయాలు, అపార్ధాలు తొలగిపోవడం మొదలైన మొదలైన విషయాలు అనుకూలంగా మాసం మధ్య వరకు ఉంటాయి. అటు పిమ్మట పెద్దల ఆరోగ్య, వృత్తి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళతారు. దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
డా|| ఈడుపుగంటి పద్మజారాణి
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు